నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మోడీకి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబం పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ విచారణ ముగిసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలది అని, ఇది రాజకీయ పురితమైన కక్ష సాధింపు చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ముంబై ఎయిర్ పోర్టును ఆదానీ కి అప్పగించడానికి సీబీఐని ఉపయోగించుకున్నారా లేదా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను బీజేపీ సీబీఐ, ఈడీ లతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. మోదీ తీరును వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ప్రధానమైన కుటుంబం మీద బీజేపీ కక్ష్య సాధిస్తుందని ఆయన విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ట్రస్ట్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకొనే అధికారం లేదని..ఇది కేవలం రాజకీయ కక్ష మాత్రమేనన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బయట తిరగనీయకుండా చేయడం కోసమే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈడీ పంపిన నోటీస్ గాంధీ కుటుంబాన్ని కాదు ఈ దేశాన్ని అవమానించినట్టు అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.