పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో పోడు పోరు హాట్ టాపిక్ అవుతోంది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ల రేంజ్ పరిధిలోని కోయపోష గూడెంలో అడవిని నరికేస్తున్నారని అటవీశాఖ అధికారులు 12 మంది మహిళలను అరెస్ట్ చేసారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టగా వారిని జైల్ కు సైతం పంపారు. జైల్ కు వెళ్ళిన ఆదివాసీ మహిళలు రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలై గ్రామానికి చేరుకున్నారు. అయితే తమకు భూమే ఆధారం ..ఎట్టి పరిస్థితుల్లో తాము పోడు చేసుకుంటున్న భూమిని వదిలిపెట్టబోమంటున్నారు.
అయితే గ్రామానికి వెళ్ళిన అధికారులు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కాని ససేమిరా అన్నారు. తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. భూమి తమకే కావాలంటుండగా అధికారులు మాత్రం అక్రమంగా అడవిలోకి చొరబడి 8హెక్టార్ల లో అడవిని ఈమధ్యనే నరికారని మంచిర్యాల డీఎఫ్ ఓ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఇన్నాళ్ల పాటు ఎవ్వరు పోడు చేయలేదని ఏడాది క్రితం నుంచే ఆదివాసీలు కోయపోషగూడెం శివారులో అడవిని నరికారని తామెవ్వరికీ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని చేసినా ఆదివాసీలకు ఆభూమి రాదని తేల్చారు.
భూమి దక్కదు, ఇవ్వమని అధికారులు అంటుంటే ఆదివాసీలు మాత్రం తమకు తిండి సైతం లేదని ఆధారమైన భూమికోసం మరోసారి జైల్ కు సైతం వెళ్తామని చెప్పేస్తున్నారు ఆదివాసీలు. ఎన్నికేసులు పెట్టినా తాము భూమి వదిలి వెళ్ళబోమంటున్నారు. భూమి తమకు వచ్చే వరకు పోరాటం ఆపబోమని అప్పటివరకు ఇక్కడే ఉంటామంటున్నారు ఆదివాసీ మహిళలు. వీటన్నింటిపై జిల్లా అధికారులు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐటీడీఏ పీఓ సైతం ఆదివాసీలతో మాట్లాడారు..భూమి హక్కు పత్రాలకోసం ఆదివాసీలు పట్టుబడుతుంటే అధికారులు మాత్రం అసలు పోడే లేదంటున్నారు. గతంలో తమకే భూమి చెందుతుందన్న అధికారులు..ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ సంఘాల నాయకులు.
Karimnagar: చదువు “కొనలేక” పేరెంట్స్ పాట్లు