తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభం అయ్యాయా? ఓ మాజీ నేత కూతురు టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా వున్నారు. ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. ఆ ఎన్నిక సమయంలోనే ఎన్నికల హాల్ నుంచి విజయా రెడ్డి బయటకు వెళ్ళిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయా రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి ఆమె కీ షాక్ ఇచ్చారు. తనకు పదవి దక్కకపోవడంతో అసహనంతో వున్న విజయారెడ్డిని మంత్రి తలసాని బుజ్జగించారు. అప్పట్నుంచి తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు విజయ ఎంతో ప్రయత్నించారు. కానీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ విజయా రెడ్డికి ఇస్తారనే హామీతోనే ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పోటీచేశారు. ఒకవేళ విజయారెడ్డికి టికెట్ ఇస్తే… శ్రవణ్ కి వేరే చోటు టికెట్ కేటాయించవచ్చంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు టికెట్ కేటాయింపు గురించి ఆలోచించాల్సిన సమయం కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నానని విజయా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. తన నాన్న పీజేఆర్…. కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ దాకా ఎదిగారని.. తాను కూడా కాంగ్రెస్ లోనే చేరాలని నిర్ణయం తీసుకున్నానని విజయా రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశానన్న ఆమె… త్వరలోనే కాంగ్రెస్ లో చేరతానన్నారు. గాంధీ ఫ్యామిలీతో తమ కుటుంబానికి అనుబంధం వుందని.. తన రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్ తోనే ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని తన తండ్రిలాగే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో వుండాలని భావిస్తున్నా అన్నారు. తన సోదరుడు పి.విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ లోనే వున్న సంగతి తెలిసిందే. పీజేఆర్ తర్వాత పీవీఆర్ కాంగ్రెస్ లో పనిచేశారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే గత కొన్నాళ్ళుగా పీవీఆర్ అంత క్రియాశీలకంగా లేరు. విజయారెడ్డి ప్రవేశం అనంతరం వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భూమిక నిర్వహిస్తారో చూడాలి మరి.
DK Aruna : మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ