సూర్యాపేట జిల్లాలో కోదాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎవరితో కలిసి పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పర్యటిస్తారని.. తాను కూడా తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు.
తనకు ఆంధ్రా జన్మినిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణకు నవ నాయకత్వం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక మార్పు కచ్చితంగా అవసరమన్నారు. తాను ఓడినా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓడిపోయాను కాబట్టే మరింత బాధ్యత, అనుభవం తెలిశాయన్నారు. కాగా కోదాడలో రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించి ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు.