సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గతంలో రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు నష్ట పరిహారం అందించనున్నారు. ఇదే విధంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో చర్చించే అవకాశం ఉంది.
శుక్రవారం ఢిల్లీలో ఆర్థికవేత్తలు, జర్నలిస్టులతోె కేసీఆర్ సమావేశం కానున్నారు. మే 21న చంఢీగడ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. సైనిక కుటుంబాలను, రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. 26న బెంగళూర్ లో మాజీ ప్రధాని దేెవెగౌడతో బెంగుళూర్ లో భేటీ కానున్నారు. మే 29,30 తేదీల్లో బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆ తరువాత మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధిలో ఉద్యమకారుడు అన్నా హజారేను కలవనున్నారు సీఎం కేసీఆర్. అలాగే కేసీఆర్ తన పర్యటనలో 2020లో గాల్వాన్ వ్యాలీ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలను పరామర్శిస్తారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు.
ఇటీవల పలు సందర్భాల్లో కేసీఆర్, ప్రధాని మోదీ, బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి నేతల నుంచి మద్దతు వచ్చింది. ఆ సమయంలో స్వయంగా కేసీఆర్ వెళ్లి సదరు నేతలను కలుస్తానని వెల్లడించారు. దీంట్లో భాగంగానే ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడాలని పలు సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ముంబైలో కలిశారు. త్వరలోనే ఢిల్లీలో ఎన్డీయేతర రాష్ట్రాల సీఎంలతో భేటీ ఉంటుందని కేసీఆర్ ఆ సమయంలో చెప్పారు.