తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? సై… నువ్వో, నేనో తేల్చుకుందామని తొడలుకొడుతున్నారా? ఇన్ని రోజులు రకరకాల వివాదాలు, ట్విస్ట్‌లతో నడిచిన సినిమా ఇక క్లైమాక్స్‌కు చేరిందా? ఎవరా ఇద్దరు నేతలు? ఎందుకు ఆ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి? తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం రేగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి విభేదాలు. ఎవరికి వారు బస్తీమే సవాల్…. రింగ్‌లోకి రా… తేల్చుకుందాం అన్నట్టుగా ఉండటంతో… ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న టెన్షన్ పెరుగుతోందట కేడర్‌లో. కారణాలు ఏమైనా… ఇద్దరికీ ఏ మాత్రం పొసగడం లేదన్నది పార్టీ వర్గాల మాట. ఆధిపత్యపోరే మెయిన్ రీజన్ అన్నది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం. రాష్ట్ర పార్టీలో పైచేయి కోసం ఒకరికొకరు చెక్ పెట్టుకునే క్రమంలో… సవాళ్ళ పర్వానికి తెర లేస్తోందన్నది తెలంగాణ బీజేపీ వర్గాల ఇంటర్నల్ టాక్. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా… బండి సంజయ్ అడ్డుకున్నారన్న అనుమానం, కోపం ఈటలకు ఉన్నట్టు అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారట బీజేపీ నాయకులు. మామూలుగా… వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే… తెలంగాణలో పార్టీ ముఖ చిత్రమే మారి పోతుందని, అలా కాకుండా…. ఎవరికి వారే… యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తుండటం ఇబ్బందికరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు కాషాయ నాయకులు.
ఈ వివాదాల ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా పడుతోందని, మిగతా నేతలకు ఇబ్బందులు వస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరి వెంట నడిస్తే… ఎవరికి కోపం వస్తుందోనని భయపడుతూ… వెనకా ముందాడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందట. చివరికి అది తెగే దాకా వచ్చిందన్నది లేటెస్ట్ టాక్. తాడో పేడో తేల్చుకోవాలని ఇద్దరూ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో కొందరు సహకరించకపోవడం వల్లే… ఇక్కడ తనకి ఓట్లు తక్కువ వచ్చాయని రెండు రోజుల క్రితం బండి సంజయ్ మాట్లాడి వస్తే…తర్వాత ఆ నియోజకవర్గ ఈటల అనుచరులు ఆయన్ని కలిసి మొరపెట్టుకున్నారట. అటు ఇద్దరు నేతలు పార్టీ ప్రయోజనాలకంటే… పరస్పరం పైచేయి సాధించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, పెద్దలు పిలిచి గట్టిగా మాట్లాడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది కేడర్‌లో. వెంటనే కేంద్ర పార్టీ జోక్యం చేసుకోకపోతే, పరిస్థితి చేయి దాటి పోతుందన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోందట కేడర్‌లో. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తయినా…. వీళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, మేడ్చల్ అర్బన్ జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటాన్ని బట్టే… పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు బీజేపీ నాయకులు.