ఆ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేకి సీఎం ఎడాపెడా క్లాస్ పీకారా? అసెంబ్లీలోని తన ఛాంబర్‌కి పిలిచి మరీ తలంటేశారా? అంత్య నిష్టూరంకంటే ఆది నిష్టూరమే మేలని అనుకున్నారా? బీఆర్‌ఎస్ పాలనతో పోలిక పెట్టేసరికి ముఖ్యమంత్రికి మంటెత్తిపోయిందా? ఎవరా ఎమ్మెల్యే? సీఎం రేవంత్‌కి ఎక్కడో తగిలేలా ఏం మాట్లాడారు? ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు వరుసబెట్టి సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్‌లు పీకడం హాట్ హాట్ పొలిటికల్ టాపిక్ అవుతోంది. మొన్నటికి మొన్న సీఎల్పీ మీటింగ్‌లో తాను మాట్లాడుతుండగానే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి లేచి వెళ్ళిపోవడంపై సీరియస్ అయ్యారు రేవంత్. పద్ధతి మార్చుకుని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూటిగా… సుత్తి లేకుండా చెప్పేశారు సిఎం. ఆ వ్యవహారం ఇంకా హస్తం నేతల నోళ్ళలో నానుకుండగానే…ఇప్పుడు మరో ఎమ్మెల్యే మీద గట్టిగా కోప్పడ్డారట ముఖ్యమంత్రి. పార్టీ సీనియర్ నేత, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ని కాస్త తగ్గమని సీఎం సీరియస్‌గానే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు హాజరైన బాలునాయక్ అసెంబ్లీ లాబీల్లో సీఎంతో చిట్‌చాట్ చేశారట. ఆ టైంలోనే…. తనకు మంత్రి పదవి ఇవ్వాలని… తన లంబాడా సామాజిక వర్గం నుండి మంత్రులుగా ఎవరూ లేరని అన్నారట. అక్కడితో ఆగితే బాగానే ఉండేది. సీఎం వింటున్నారు కదా అని… బాలు నాయక్ మరో అడుగు ముందుకేసి….గత ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి చాలా ప్రాధాన్యం ఇచ్చిందని, రెండు సార్లు తమకు అవకాశాలు కల్పించారని చెప్పారట.
ఆ దెబ్బకు మంటెక్కిపోయిన ముఖ్యమంత్రి…. బాలు నాయక్‌ని తన ఛాంబర్‌కి పిలిచి మందలించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా మంత్రివర్గంలో గిరిజనులకు చోటేదని బాలు నాయక్ చేసిన కామెంట్స్ సీఎం ఆగ్రహానికి కారణంగా చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా బాలు నాయక్ మంత్రి పదవిని ఆశిస్తూ పార్టీ పెద్దల నోళ్ళలో నలుగుతున్నారు. ఎప్పటికప్పుడు ఎస్టీ కోటాలో ఆయన పేరు బయటికి వస్తూనే ఉంది. ఆయన సీనియార్టీ, సిన్సియారిటీకి తగినట్లుగా ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉన్నట్లు లీకులు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో… సాధారణంగా ఆచితూచి వ్యవహరిస్తారని పేరున్న బాలు నాయక్…. తనకు మంత్రి పదవి కావాలని అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్ చేయడం, అంతకు మించి…. గత ప్రభుత్వంలో తమ కులానికి మేలు జరిగిందంటూ ప్రస్తుత సర్కార్‌తో పోల్చి చెప్పడం ముఖ్యమంత్రికి మింగుడు పడి ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. గుట్టుగా నాలుగు గోడల మధ్య, నలుగురు ముఖ్య నేతల మధ్య చర్చించాల్సిన అంశాన్ని.. లాబీలో చర్చించి.. పార్టీ, ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శించేందుకు అవకాశం ఇచ్చిన బాలు నాయక్ వ్యవహారాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారట. ఇలాంటి వాటికి మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన సీఎం… డైరెక్ట్‌గా బాలు నాయక్ ను తన ఛాంబర్ కు పిలిపించి మందలించినట్టు చెప్పుకుంటున్నారు. మరోసారి ఇలాంటి కామెంట్స్ రావద్దని, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే… అనుభవానికి తగ్గట్లు వ్యవహరించాలని, ఆ పరిణితి మాటల్లో, చేతల్లో కనిపించాలని…. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే విషయంలో కాదని క్లాస్ పీకినట్టు సమాచారం. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న బాలు నాయక్ ఆచితూచి వ్యవహరిస్తారన్న పేరుంది. ఎంత ఎదురు చూస్తున్నా మంత్రి పదవి దక్కడం లేదన్న ఫ్రస్ట్రేషనో, మరోటోగానీ మొత్తం మీద అసెంబ్లీ లాబీల్లో బరస్ట్ అయి సీఎంతో చీవాట్లు తినాల్సి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. మరి వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా? సరే…. తప్పో ఒప్పో జరిగిపోయింది కాబట్టి….. రేపు కేబినెట్ విస్తరణలో బాలు పేరును పరిశీలిస్తారా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.