కొంతకాలంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి లోకల్ టీఆర్ఎస్ కీలక నేతలకు, ఉద్యమకారులకు మధ్య గ్యాప్ వచ్చింది. టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి వచ్చిన వారితోనూ దూరమే. చివరకు తెలంగాణ ఉద్యమకారులు టచ్ మీ నాట్‌గా ఉండటంతో.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒంటరైన పరిస్థితి. ఆలస్యంగా సమస్యను గుర్తించినా.. ఆ తీవ్రత వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందని MLA గ్రహించారట. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు భూపాల్‌రెడ్డి. అయితే, కొద్దిరోజులుగా ఎమ్మెల్యే డైలీ ప్రోగ్రామ్స్ మారిపోయాయి. ఉద్యమ కారులు, టీఆర్‌ఎస్ సీనియర్ల ఇంటికి వెళ్తున్నారు. వాళ్ల ఇంటికి వెళ్లి.. అక్కడ చాలా సేపు కూర్చుని కుశల ప్రశ్నలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పలువురు నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల అటెన్షన్ తమపై పడేలా ఆ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఆశావహుల్లో కొందరు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు పార్టీలో చర్చగా మారుతున్నాయి.
Read Also: Thodelu Movie Review: తోడేలు రివ్యూ (హిందీ డబ్బింగ్)
నల్లగొండలో తన రాజకీయ వారసుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని అనుకుంటున్నారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఇప్పటికే తమ ఫౌండేషన్ ద్వారా కుమారుడు అమిత్‌ను ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నంలో ఉన్నారు. జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్‌రెడ్డి సైతం తనకు అవకాశం ఇస్తే జార విడుచుకునేది లేదని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి హోదాలో చాడా కిషన్‌రెడ్డి సైతం ఉద్యమకారులను కలుస్తున్నారు. ఇలా నల్లగొండలో టీఆర్ఎస్ నేతలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
నియోజకవర్గంలో సామాజిక లెక్కలు తీసుకుని.. ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో కనుక్కొని వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పడరాని పాట్లూ పడుతున్నారు. పార్టీలో ఎవరూ తన సీటుకు ఎసరు పెట్టకుండా… కనిపించిన వారిని నవ్వుతూ పలకరిస్తూ.. సొంత పార్టీ నేతలను ఆలింగనాలు చేసుకుంటూ.. కొత్త రాజకీయానికి తెరతీశారు. ముఖ్యంగా యాదవ సామాజికవర్గంపై పార్టీ నేతలు కురిపిస్తున్న ప్రేమ చర్చగా మారుతోంది. మరి.. ఈ పలకరింపులు.. కుశల ప్రశ్నలు ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి.