గ్యాస్ ధర పెంపుపై బీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తుంది : డీకే అరుణ
గ్యాస్ ధర పెంపు పై బీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం నీ బద్నాం చేసే కుట్ర పన్నుతోందని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తాజాగా ఆమె మాట్లాడుతూ.. … మంత్రులకు బుద్దిలేదు… డబల్ బెడ్ రూం, 3016 ఇవ్వలేదని సీఎం దగ్గర ధర్నాలు చేయండన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ఆమె డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం రెండు సిలిండర్ లు ఫ్రీ గా ఇస్తుందన్నారు. మేము అధికారంలో ఉంటే ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలకి మేము ఇచేవాళ్ళమని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ కి రాజకీయాలు చేయడమే కావాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు కవితకు ఇప్పుడు గుర్తొచ్చిందా… పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఏమీ చేసిందని ఆమె అన్నారు. లిక్కర్ స్కాం నుండి డైవర్ట్ చేసేందుకు ధర్నాలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అయితే మేఘాలయ, త్రిపుర , నాగాలాండ్ లలో ఎందుకు పోటీ చేయలేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే బీఆర్‌ఎస్ అని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల్లో బీజేపీ విజయంతో పార్టీ శ్రేణుల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. నృత్యాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు బీజేపి నాయకులు. ఈ సందర్భంగా బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీ విజయదుంభి మోగించిందన్నారు. మేఘాలయలోనూ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ఆయన అన్నారు. మిత్రపక్షాలతో కలిసి మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించడం మామూలు విషయం కాదని ఆయన అన్నారు. త్రిపురలో కమ్యూనిష్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ప్రజలు తిరస్కరించారని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నేషనల్ హైవే పనులపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బండి సంజయ్ భేటీ
జాతీయ రహదారుల విస్తరణ పనులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఈరోజు ఎల్కతుర్తి- సిద్దిపేట (NH-765DG) జాతీయ రహదారి విస్తరణ పనులుసహా ఇతర రహదారుల పనుల పురోగతిపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ప్రధానమంత్రి నరంద్రమోదీ చేతుల మీదుగా గతేడాది నవంబర్ 12న సిద్దిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. నాటి నుండి చేపట్టిన పనుల పురోగతితోపాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏయే పనులు చేపట్టాలనే పనులపై సమీక్షించారు. మొత్తం 578.85 కోట్ల రూపాయలతో చేపట్టిన 63.641 కి.మీల మేర పనులు కొనసాగుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా బండి సంజయ్ కు వివరించారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా రంగధామంపల్లి బ్రిడ్జి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు మిట్టపల్లి, ముండ్రాయి, పల్మాకుల, బద్దిపడగ, బస్వాపురం, సముద్రాల, పందిళ్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్), జిల్లెలగడ్డ, ముల్కనూర్, కొత్తపల్లి, ఇందిరానగర్, ఎల్కతుర్తి గ్రామాల మీదుగా రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ఈ పనుల్లో భాగంగా బస్వాపూర్, పందిళ్ల వద్ద నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 26 మైనర్ బ్రిడ్జీల పునర్నిర్మాణం వివరాలను ఈ సందర్భంగా బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ రహదారి విస్తరణ పనుల్లో బాగంగా కల్వర్టు నిర్మాణం, జంక్షన్ ఇంప్రూవ్ మెంట్, రీ అలైన్ మెంట్లు, స్ట్రక్చర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గ్రుహాలు, మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ముల్కనూరు డెయిరీ సంస్థకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టాలని పేర్కొన్నారు. రహదారి విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వివరాలను సైతం బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు.
సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే బుక్ రిలీజ్ చేసిందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైజాగ్‌లో రేపు సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఫాల్స్ బుక్ లెట్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సత్యం రామలింగ రాజు,కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ ను వేధించామంటున్నారు.. వారికి మాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించారని ఆరోపించారు. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్దాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ మాఫియాను పాకిస్తాన్ రక్షిస్తోంది.. అమిత్ షాతో పంజాబ్ సీఎం..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. పంజాబ్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు భద్రతపై ఇరువురు నేతల చర్చించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రామీణాభివృద్ధి నిధులను విడుదల చేయాలని సీఎం భగవంత్ మన్, హోంమంత్రిని కోరారు.
ఓ వైపు చెల్లెలి పెళ్లి… మరోవైపు అన్న మరణం.!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కంసాన్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. చెల్లెలు పెళ్లి వివాహ ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్మీ జవాన్ శ్రీనివాస్ రాత్రి మృతి చెందారు. చెల్లెలు పెళ్లి జరిగిన రోజునే అన్న కన్ను మూయడం ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. కంసాన్‌పల్లికి చెందిన ఇప్పటూరు సత్యమ్మ-సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కొడుకు శ్రీనివాస్ ఆర్మీ జవాన్ గా జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. చెల్లి వివాహం నిమిత్తం ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచే క్రమంలో పది రోజుల క్రితం మండల పరిధిలోని కమ్మదనం వద్ద బైకు అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా గత రాత్రి మృతి చెందాడు. ఓవైపు పెళ్లి వేడుక మరోవైపు విషాదం.. శ్రీనివాసు చెల్లెలు శిరీషకు వికారాబాద్ జిల్లా దారూరు మండలం రాపూర్ కు చెందిన గోవర్ధన్ తో బుధవారం వివాహం జరిగింది. వరుడు స్వగ్రామంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత శ్రీనివాస్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. కంసన్‌పల్లికి చేరుకున్నకా అంత్యక్రియలో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు సహచరులు గాలిలో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
హత్రాస్ అత్యాచారం కేసులో కీలక తీర్పు.. ఒకరికి జీవిత ఖైదు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ అత్యాచార ఘటన. దేశ రాజకీయాలన్నీ ఈ ఘటన చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేసు ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2020లో జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురిని నిర్దోషులుగా గురువారం కోర్టు ప్రకటించింది. 2020 సెప్టెంబర్ లో 19 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన హత్రాస్ జిల్లాలోని బూల్‌గర్హిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అగ్రవర్ణాలకు చెందిన సందీప్ (20), రవి (35), లవ్ కుష్ (23), రాము (26) నిందితులుగా ఉన్నారు. వీరంతా బాధిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో కోర్టు 167 పేజీల తీర్పును వెలువరించింది. నలుగురు నిందితుల్లో సందీప్ మాత్రమే దోషి అని, మిగతా ముగ్గురు నిర్దోషులు అని కోర్టు తేల్చింది. సందీప్ కు జీవిత ఖైదు విధించింది.
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స, సజ్జల భేటీ
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు.ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, ఏపీ ఎన్జీవోల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. రెండు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని అడిగామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పెండింగ్ డీఏలు ఇవ్వలేకపోయామని చెప్పారని ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక పెండింగులో ఉన్న డీఏల్లో ఒక డీఏ ఇస్తామని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
బీజేపీని ఓడించడం, మోదీ ప్రధాని కాకుండా చూడటమే మా లక్ష్యం : ఎంకే స్టాలిన్
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి రాకుండా చూడటం, ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చూడటం తమ లక్ష్యమని, విపక్షాలు అందుకోసమే ప్రయత్నిస్తున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లా కోరడంపై మాట్లాడుతూ.. తాను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే నిమగ్నమై ఉన్నానని స్టాలిన్ అన్నారు.
రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ సాయుధబలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నానని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ‘‘విజయ్ సంకల్ఫ్ యాత్ర’’ రెండో విడతను ప్రారంభించిన ఆయన, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.
అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (67) కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పట్ల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపల్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
వ్యక్తి మృతి.. కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ వ్యక్తి మృతి కేసులో కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి మరి. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్‌కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సత్తయ్య మృతికి కోడే కారణమని A1 ముద్దాయిగా చేర్చి, పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే.. తన కూతలతో స్టేషన్‌ను హోరెత్తిస్తోంది ఆ కోడి.