యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించాక ధాన్యం కొనుగోలు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళ ను ప్రారంభించినా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 14 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు. ఇందుకు గానూ ఉమ్మడి జిల్లాలో 934 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యం తో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటన వచ్చి వారం రోజులు అయినా ఉమ్మడి జిల్లాలో సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కొన్ని సెంటర్లు ప్రారంభమైనా యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటివరకు ధాన్యం కొనలేదు. రిబ్బన్ కట్ చేసి సెంటర్లను ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత కొనుగోళ్లు సాగుతున్నాయా లేదా? అని పట్టించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రా లకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగి సీజన్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా లక్ష ఆరువేలమంది రైతులు 1 లక్ష 65 వేల 352 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 3 లక్షల 55 వేల 770 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 280 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 34 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకు ఏ సెంటర్లో కూడా ధాన్యం కొనలేదు. కొనుగోళ్లు జరిగేందుకు ఇంక వారం పట్టే అవకాశం ఉంది.గన్నీ బ్యాగుల కొరత,ఏ సెంటర్ నుంచి ఏ మిల్లుకు వడ్లను తరలించాలన్న అంశంపై క్లారిటీ రాకపోవడం, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు వెహికిల్స్ కేటాయించక పోవడంతో ధాన్యం కొనుగోలు లో జాప్యం జరుగుతోంది.
ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకు మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Botsa Satyanarayana: సీఎం ఇంటిని ముట్టడిస్తానని చెప్పడం సరికాదు