తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం ఇటీవల విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సురేష్ సెల్ఫీవీడియో లభ్యమైంది. అయితే ఈ సెల్ఫీ వీడియోని కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు.
జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలు వడ్డీరూపంలో చెల్లించానని, వడ్డీ వ్యాపారి గణేష్‌కి రూ.80 లక్షలు చెల్లించానని వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీవీడియోలో సురేష్ పేర్కొన్నారు. వ్యాపారుల ఆగడాలను అరికట్టాలంటూ ప్రభుత్వానికి సురేష్ విజ్ఞప్తి చేశారు. ప్రామిసరీ నోట్లు, ఖాళీ పేపర్లపై భార్య, పిల్లల సంతకాలు చేయించుకున్నారని, ప్రామిసరీ నోట్లతో భార్య, పిల్లలను వేధించారని, వడ్డీ చెల్లించినప్పటికీ తన ఇంటిని జప్తు చేశారని సెల్ఫీ వీడియోలో సురేష్ తెలిపాడు. దీంతో జ్ఞానేశ్వర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.