Monkey Pox Case In Khammam District: ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్ మహమ్మారి.. భారత్‌లోనూ వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కేరళలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఖమ్మంలోనూ ఓ అనుమానాస్పద మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఖమ్మం మండలం (రూరల్)లోని ఓ గ్రానైట్ కంపెనీలో పని చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కొంతమంది కార్మాకుల్లో.. సందీప్ అనే 35 ఏళ్ల కార్మికుడి శరీరంపై దద్దర్లు వచ్చాయి. దీంతో అతడ్ని ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడ్ని పరిశీలించిన డాక్టర్ బాబురావు.. అనుమానం రావడంతో జిల్లా వైద్య శాఖ అధికారికి సమాచారం అందించారు. మొదట జిల్లా ఆసుపత్రికి తరలించిన అధికారులు.. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఒంటిపై దద్దర్లు వచ్చాయని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. మంకీ పాక్స్‌గా అనుమానిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. రెండు నెలల నుంచే తన ఒంటిపై దద్దర్లు ఉన్నాయని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కి పంపించాం. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చాక, ఇది మంకీ పాక్సేనా? కాదా? అనే వివరాలు తెలుస్తాయి’’ అని వెల్లడించారు.