ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పేరిట మోయలేని భారం మోపడం బాధాకరమని, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ మిగులు రాష్ట్రమైతే ప్రజల నడ్డి విరిచి రాష్ట్ర ఖజానా నింపుకునే చర్యలు ఏమాత్రం క్షమించరానిదన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు ఉపసమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక విధానాలు, క్రమశిక్షణ రాహిత్యం వలన రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, గత ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకు కరెంట్ కోనుగోలు చేసి అవినీతికి పాల్పడటం వలన రాష్ట్ర ప్రజలపై విపరీతమైన చార్జీల భారం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 50 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించకపోవడం వలన డిస్కంలు అప్పులు ఊభిలో కూరుకుపోయాయని, వీటిని సాకుగా చూపి పేద, మధ్యతరగి ప్రజలపై అధిక చార్జీలు మోపడం దారుణమన్నారు. మీ స్వార్ధ ప్రయెజనాల వలన రాష్ట్ర అర్ధిక పరిస్థితి దివాళ తీసిందనే వాస్తవాన్ని తోక్కిపెట్టడానికి, మీ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని తరువాత ఒక దానిపై రేట్లు పెంచుకుంటూ పోవడం అన్యాయం. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపు అందులో భాగమేనని ఆయన మండిపడ్డారు.