నాపై కేసు వెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్ర దాగిఉందని ఆరోపించారు బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు రోహిత్‌రెడ్డి.. మాపై మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు కాంగ్రెస్, బీజేపీ కుట్రగా అభివర్ణించారు.. మేం పార్టీ మారితే.. నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? అని నిలదీసిన ఆయన.. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్‌లో 12 మంది ఎమ్మెల్యేలం కాంగ్రెస్ పార్టీ నుంచి విలీనం అయ్యామని స్పష్టం చేశారు.. అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరు దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు.. ఏం భయపడే లేదు.. దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి..
Read Also: CBI: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత..
కాగా, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొత్తంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా నడిచిన విషయం విదితమే.. అయితే, ఆ తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రెండు రోజుల పాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు.. రోహిత్ రెడ్డి ఆస్తులు, వ్యాపారా లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఫైలట్ కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాలు, కంపెనీ వివరాలపై ప్రశ్నించారు. 17 బ్యాంక్ ఖాతాలు, 3 లాకర్ల వివరాలతో ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయమై తనను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిపారు. తాను ఈ కేసులో ఫిర్యాదు చేస్తే.. తనను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఫైలట్ మీడియాతో వెల్లడించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ఈడీ ఎందుకు విచారిస్తుందో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.. మొత్తంగా ఎమ్మెల్యేల ఎరకేసు వెలుగు చూసిన తర్వాత.. రోహిత్ రెడ్డిపై కొత్త కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.