గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్ లో నిర్వహించిన ‘ మహిళా దర్బార్’ పై పొలిటికల్ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమస్యలను చర్చించేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన మహిళా దర్భార్ కు విశేష స్పందన వచ్చింది. మెయిల్, ఫోన్ ద్వారా రాజ్ భవన్ కి కాంటాక్ట్ అయిన 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజ్ భవన్ కి వచ్చారు.
ఇదిలా ఉంటే గవర్నర్ మహిళా దర్బార్ కార్యక్రమంపై కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద ఫైర్ అయ్యారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా సహనంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. ఈ రోజు రాజ్ భవన్ లో జరిగింది ప్రజాదర్భార్ కాదని పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. గవర్నర్ మహిళా దర్బార్ పెట్టి పొలిటికల్ కామెంట్స్ చేశారని అన్నారు. మర్యాద దక్కడం లేదని గవర్నర్ చేస్తున్న కామెంట్స్ అసత్యం అని ఆయన అన్నారు. మన గౌరవం మనం కాపాడుకోవాలని సూచించారు.
గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలోనే కాదు గవర్నర్ వ్యవస్థను పశ్చిమ బెంగాల్లో కూడా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు గవర్నర్ కమలా బేనీవాల్ ఇలాంటి సభలు పెడితే, మోదీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉత్తరం రాసి గవర్నర్ ను తొలగించాలని కోరారని గుర్తు చేశారు.
బీజేపీకి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే చేత కాక ఇలా గవర్నర్ తో రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుందని అన్నారు. గవర్నర్ తన గౌరవానని తాను కాపాడుకోలేకపోతున్నారని అన్నారు. గవర్నర్ చేసింది కరెక్ట్ అయితే అన్ని రాష్ట్రాల రాజ్ భనవ్ లో ప్రజా దర్బార్ పెట్టాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 8పై రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.