తెలంగాణలో రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవని.. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజలను ఎలా బతికించాలనేదే లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎలా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ మోదీని, మోదీ కేసీఆర్ ని తిట్టుకున్నట్లు నటించారని ఆరోపించారు.
ఏపీలో బీజేపీ కులాలకు ప్రయారిటీ ఇస్తోందని.. తెలంగాణలో మతపరమైన అంశాలను రెచ్చగొట్టే పనిలో పడ్డారని అన్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ మహిళా దర్బార్ వెనక బీజేపీ, ప్రధాని మోదీ ఉన్నారని.. బీజేపీ డైరెక్షన్ లోనే దర్బార్ పెట్టారని.. గవర్నర్ కు సమస్యలపై చర్యలు తీసుకోవడానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. గవర్నర్ వెళ్తే జిల్లా ఎస్పీ, కలెక్టర్లే రావడం లేదు.. ఆమె ఏం చర్యలు తీసుకుంటారని అన్నారు. గవర్నర్ పిలిస్తే డీజీపీ, సీఎస్ రారని ఆయన అన్నారు. మహిళలకు జరిగే అవమానం కన్నా గవర్నర్ కే ఎక్కువ అవమానం జరిగిందని అన్నారు.
గవర్నర్ పాలన వస్తే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతుందని..గవర్నర్ కేంద్రం ఏం చెబితే అదే వింటారని.. గవర్నర్ పాలన కోరితే కాంగ్రెస్ ప్రమాదంలో పడ్డట్లే అని వ్యాఖ్యానించారు. కేంద్రం రాయబారం చేయాలంటే గవర్నర్ తో , రాజకీయం చేయాలనుకుంటే టీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ వ్యతిరేఖ ఓటు కాంగ్రెస్ కు పోవద్దని ఆలోచన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో అన్నీ తేలిపోతాయని అన్నారు. బీజేపీని టీఆర్ఎస్ వ్యతిరేఖిస్తే యూపీఏ అభ్యర్థికి ఓటేస్తారని.. ఒక వేళ తటస్థంగా ఉన్నా బీజేపీకి మేలు చేసిన వారే అవుతారని అన్నారు.
రాజా సింగ్, అజ్మీర్ దర్గాకు వెళ్లవద్దని హిందువులకు చెబుతున్నాడని.. దర్గా పుట్టి 700 ఏళ్లు అయిందని, రాజాసింగ్ పుట్టి 50 ఏళ్లు అయిందని అన్నారు. దర్గాలకు, పీర్లకు ముస్లింలు 50 శాతం పోతే, హిందువులు 50 శాతం పోతారని జగ్గారెడ్డి అన్నారు. రాజాసింగ్ మొదటి నుంచి మతాన్ని రెచ్చగొడుతున్నాడని.. సీట్లను పెంచుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రాజాసింగ్ కు పిచ్చి పట్టిందని.. రెచ్చగొట్టి ఇంట్లో పడుకుంటాడని.. కొట్లాడి సచ్చిపోయేది యువకులే అని అన్నారు. రాజాసింగ్ కు దమ్ముంటే హిందువులు అజ్మీర్ దర్గాకు వెళ్లకుండా ఆపాలని సవాల్ విసిరారు.