రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. మండల, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు విద్యుత్తు సరఫరా సమస్యలపై మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 24 గంటలు ఏమోగానీ అన్నదాతలకు కనీసం16 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తే బాగుంటుందని అన్నారు..ప్రస్తుతం రైతులకు 9గంటలు సరఫరా అవుతున్న వోల్టేజి కరెంట్ వలన ట్రాన్స్ఫార్మర్స్, స్టార్టర్ లు కాలిపోతున్నాయని అన్నారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూలు, కొల్లాపూర్ వచ్చి భారతదేశం లోనే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పి పోయాడని, అలాగే ఇటీవలే మునుగోడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు మీటర్లు పెడుతున్నారని ఓ పార్టీని విమర్శించిన కేసీఆర్ ముందు క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఓవైపు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే కేసిఆర్ మాత్రం పంజాబ్ రైతులకు మూడు లక్షల చొప్పున అందజేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే డొమెస్టిక్ విద్యుత్ చార్జీలను రెండుసార్లు పెంచిందన్నారు.
కేవలం ఒక రూమ్ గల ఇండ్లలో నివసిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ ప్రజల నుండి సబ్సిడీ లేకుండా కరెంటు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి చెల్లిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముగ్గురు రైతులు కలిసి డీడీలు కడితే వారికి ట్రాన్స్ ఫార్మర్ లు, కరెంట్ వైర్లు, సంబంధిత పరికరాలు అందజేసేవారని, కానీ ప్రస్తుతం ముగ్గురు రైతులు కలిసి డిడి కట్టినా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదని అన్నారు..ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 15 రోజులలోగా రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తును సరఫరా చేయడమే గాక సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందజేసి రైతులకు వ్యవసాయపరంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. లేనియెడల మా నాయకులు టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతి సబ్ స్టేషన్ ముందు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
Niranjan Reddy: గుంటూరులో తెలంగాణ మంత్రి టూర్.. రైతులతో ముచ్చట్లు