హైదరాబాద్ పంజాగుట్టలో మృతి చెందిన చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో చంపిన కసాయి తల్లి హైదరాబాద్‌కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్.. రైలులో 2,348 మంది ప్యాసింజర్లు
కాగా ఈనెల 4న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో టెన్నిస్ కోర్టు వద్ద ఓ షాపు పక్కన గుర్తుతెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఆ రోజు రాత్రి అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పంజాగుట్ట పోలీసులు భిన్న కోణాల్లో ఈ కేసును విచారించారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చిన్నారి చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితులను కనిపెట్టారు. ముసుగు ధరించిన మహిళ ఆటోలో బాలికను తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు. అనంతరం నిందితులు వేరే రాష్ట్రానికి వెళ్లినట్లు గుర్తించి నాలుగు పోలీస్ బృందాలు, మూడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.