Mission Bhagiratha Gets Jal Jeevan Mission Award: మిషన్ భగీరథ పథకంలో భాగంగా.. ఇంటింటికీ నల్లాతో శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం గుర్తించింది. దీంతో.. మరోసారి మిషన్ భగీరథను జాతీయ స్థాయి అవార్డుకి ఎంపిక చేసింది. అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఢిల్లీలో అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ అవార్డును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలు తీరుని జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా 320 గ్రామాల్ని ఎంపిక చేసి, జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే.. ప్రజల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే.. మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి 100 లీటర్ల మేర నాణ్యమైన తాగునీరు నల్లాతో అందుతున్నట్టు గుర్తించింది. నాణ్యత పరిమాణంలో మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’లో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నంబర్ వన్‌గా గుర్తించి.. జల్ జీవన్ మిషన్ అవార్డుకు సెలెక్ట్ చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం వల్లే ఈ అవార్డులు వస్తున్నాయని అన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. తనతో పాటు అహర్నిశలు పని చేస్తున్న తన సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధుల్ని అభినందించారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు, మంత్రి కేటీఆర్ సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని స్పష్టం చేశారు.