నేడు తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్థాపంతో ఇప్పటికే 7గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్ట పోకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సమయంలో విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వారి తల్లిదండ్రులను కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని కళాశాల లెక్చరర్ లకు ఆమె విజ్ఞప్తి చేశారు.