Telangana Minister of Labour and Employment Mallareddy Addressed at May Day Celebrations at Ravidra Bharati.
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్ల నుంచి కార్మికులకు స్వాతంత్ర్యం రాలేదని, కార్మికుల ఓట్లను అనేకమంది దండుకున్నారు కానీ మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల అభివృద్ధి కోసం రైతుబంధు, దళితుల అభివృధ్ధికోసం దళితబంధు తీసుకొచ్చారని, కరోనాతో దేశం రాష్ట్రం అతలాకుతలం అయినప్పటికీ కార్మికులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హమాలీలకు 20వేలు కూడా ఇచ్చేవారు కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 60వేలు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఏ రాష్ట్రంలో పెంచని విధంగా కేసీఆర్ కార్మికులకు జీతాలు పెంచారని ఆయన తెలిపారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చారు. రాహుల్ గాంధీ వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.. దివాళా తీసిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు…? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెట్రో ధరలు, గ్యాస్ ధరలు పెంచుతున్నాం. వరి వేస్తే కొనం అని చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నారా? 8 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది. 24 గంటలు కరెంట్ ఇస్తుందా? నీళ్లు ఇస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు తరిమి తరిమికొట్టాలని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటారని ఆయన అన్నారు.