తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. శుక్రవారం నాడు మేడారం జాతరకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వెల్లడించారు. గతంలో తాను కోరుకున్న కోర్కెలను అమ్మవారు తీర్చారని.. ఇప్పుడు కూడా తన కోరికను అమ్మవార్లు తీరుస్తారని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అటు మంత్రి గంగుల కమలాకర్ కూడా మేడారంలో కొలువు తీరిన వనదేవతలను దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు, సీఎం కేసీఆర్‌పై అమ్మల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మేడారం జాతరకు విచ్చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.