Minister KTR Suggested TRS Leaders To Not Speak Infront Of Media: మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన బేరసారాల వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని, సిట్‌ని నియమించాలని డిమాండ్ చేసింది. అటు.. టీఆర్ఎస్ నేతలు సైతం విమర్శలు తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ట్విటర్ మాధ్యమంగా ఓ సూచన ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉంది. కాబట్టి.. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు.
కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనే కూపీ లాగేందుకు.. ఆ ముగ్గురిని రహస్య ప్రాంతాల్లో ఉంచి, పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు నిన్న రాత్రి నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వారితో పాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని ఎలా ఎండగట్టాలి, తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై.. పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు కూడా జరిపారు. ఈ క్రమంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారని, నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ.. మీడియా సమావేశం నిర్వహించలేదు. ప్రాథమిక విచారణ కొనసాగుతోంది కాబట్టి, ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించడం సరైనది కాదనుకొని, వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది.