Minister KTR Started Bansilalpet Step Well: శతాబ్దాల చరిత్రల కలిగిన బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. గతేడాది నుంచి పునరుద్ధరణ పనులు జరుపుకుంటోన్న ఈ బావి.. ఇప్పుడు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. సహిత అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. జీహెచ్‌ఎంసీ ఈ బావిని నాటి వైభవం కళ్లకు కట్టేలా పునరుద్ధరించింది. చెత్తాచెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను జీహెచ్‌ఎంసీ గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించింది. సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి, ఎన్నో మరమ్మత్తులు చేపట్టింది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు పనులన్నీ పూర్తైన నేపథ్యంలో.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ ఈ మెట్ల బావిని ప్రారంభించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా అంపీ థియేటర్, వ్యర్థాలను తొలగిస్తున్నప్పుడు లభ్యమైన వివిధ రకాల పరికరాల ప్రదర్శన కోసం గ్యాలరీతో పాటు పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఈ బావిలో ఏర్పాటు చేశారు.
కాగా.. ఈ మెట్ల బావిని మూడు శతాబ్దాల క్రితం సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం అసఫ్-జాహీ వంశస్తులు నిర్మించారు. ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో ఈ బావిని ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. కాలక్రమంలో ఈ బావి పాడైపోవడంతో.. ఆంగ్లేయుల కాలంలో 1933లో నాటి సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టీహెచ్ కీస్ దీనిని పునరుద్ధరించారు. 1970 వరకూ ఈ బావి బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఇది నిరాదరణకు గురైంది. దీనిని చెత్త వేడానికి జనాలు వినియోగించారు. అలా చెత్త వేయడంతో, అది పూడుకుపోయింది. గతేడాదిలో ఈ బావిని గుర్తించి, 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి పునరుద్ధన పనులు మొదలుపెట్టారు. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి, కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న ఈ బావి లోపల నుంచే ఒక నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని గుర్తించారు. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతోంది.