ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు అన్నారు.. జీవితం చాలా పెద్దది, అపజయం ఎదురైతే బేజారు కావొద్దు.. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిపాదిక నీళ్లు, నిధులు, నియామకాలు.. ఎనిమిదేళ్లలో సాగునీటి రంగలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని తెలిపారు మంత్రి కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తి పోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించామని గుర్తుచేసిన ఆయన.. సాగునీటి సౌకర్యం ఏర్పాటుతో బీడు భూములు సస్య శ్యామలం అయ్యాయని.. భూముల రేట్లు ఎన్నో రెట్లు పెరిగాయని వెల్లడించారు.. అభివృద్ధికి ప్రామాణికాలు అయిన తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో ముందంజలో ఉన్నామని పేర్కొన్న ఆయన.. మన నిధులు మన కోసమే ఖర్చు చేసుకుంటున్నాం అని తెలిపారు.
స్వరాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో 1 లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.. కొత్తగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు కేటీఆర్.. పరిశ్రమల స్థాపనను ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది.. టీఎస్ ఐపాల్ ద్వారా 8 ఏళ్లలో 19 వేల పరిశ్రమలను స్థాపించేలా చూసి 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల క్రితం లేఖ రాశాం.. చివరకు 10 లక్షల ఉద్యోగాలు రెండేళ్లలో భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.