బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? అంటూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది బీజీపీ తప్ప దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. మత ప్రబోధకుడిపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించడంతో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించిన కేటీఆర్… బీజీపీ నేతల తీరు వల్ల అంతర్జాతీయ సమాజానికి దేశం క్షమాపణ చెప్పాల్సి వస్తుందన్నారు.
విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని ట్విటర్లో మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నట్లు బీజేపీ విడుదల చేసిన ప్రకటనపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మత భావాలను కించపరిచే విధంగా వ్యవహరించిన నేపథ్యంలో వారిపై బీజేపీ ఈ చర్యలు తీసుకుంది. ఒక వర్గం వారిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఏ మతానికి చెందిన వ్యక్తులనైనా అవమానించడాన్ని బీజేపీ ఖండిస్తుందని పార్టీ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ప్రశ్న సంధించారు.
బీజేపీ నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంటే.. ఇతర మతాలను అగౌరవపరుస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌పై చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. అన్ని మసీదులను తవ్వాలని.. ఉర్దూపై నిషేధం విధించాలని బహిరంగ వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకీ పక్షపాత ధోరణి అంటూ నిలదీశారు. దీనిపై ఏమైనా స్పష్టత ఇవ్వగలరా అని నడ్డాను ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.