కరోనా వైరస్ మన దేశంలో విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, మృతి చెందుతున్నారు. అయితే ఇటీవల సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతి చెందారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు అంజయ్య కుటుంబం కేటీఆర్ ను కలిశారు. అంజయ్య చాలా సమర్థ అధికారి అని, ఆయన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి కేటీఆర్ తెలిపారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడంతోపాటు అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.