ప్రభుత్వం నిధులు అందిస్తుండడంతో గ్రామాలు వేగంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కే.పొట్టపెల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన పోచమ్మ ఆలయం, రూ.10 లక్షలతో నిర్మించిన భీమన్న ఆలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదా నాన్ని ప్రారంభించారు.
పశుసంవర్ధ్దక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రె, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీలు, మురుగు కాలువలతో అవసరమైన అన్నిసౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు.
యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనుకడుగు వేస్తే, ప్రభుత్వం ఎంత భారమైనా వడ్లను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే పొట్టపెల్లి (కే)లో రూ. 9. 5 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టామని, మరో 30 లక్షల నిధులు మంజూరు చేస్తానని పేర్కొ న్నారు. కొన్ని మీడియా సంస్థలు సీసీరోడ్ల బిల్లుల ను ప్రభుత్వం చెల్లించడం లేదని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే పట్టణాలకు మహర్దశ వచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని షేక్ సాహెబ్‌పేట్‌లో పర్యటించారు. వార్డులో నూతన రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.