దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణ మారిపోతోందన్న అక్కసుతోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడానికి దారి తీసిన కారణాల్లో సంగారెడ్డి జిల్లాలోని పరిస్థితులు ఒకటన్నారు.
రూ 4400కోట్లతో 4.5లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డికి వచ్చిన కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇస్తా అని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం కాలేజీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో గుజరాత్ ను దాటి పోతుందన్న అక్కసుతో మోదీ పార్లమెంట్ లో అక్కసు వెళ్లగక్కుతున్నారు.
తెలంగాణలో అభివృద్ధిని చూసి కన్నుకుట్టి అవమానిస్తున్నారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయలేక ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ కులం, మతం పేరుతో బతుకుతోంది. మోడీ ప్రధానిగా ఏ రాష్ట్రాన్నీ అభివృద్ధి చేశాడో చెప్పాలి. దేశాన్ని ముంచిన వ్యాపారులను మోదీ దేశం దాటిస్తున్నాడని విమర్శించారు.
ఓ వైపు ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ.. ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.చిన్న జీయర్ స్వామి రామానుజుల విగ్రహం పెడితే.. మోదీ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు పరిశీలించాలి. బీజేపీ నాయకులు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశానికి ఉపయోగపడే నాయకుడే ప్రధాని అయ్యేలా కేసీఆర్ రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారన్నారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి.