Site icon NTV Telugu

Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..

Pournami

Pournami

Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, కాళేశ్వరం త్రివేణి సంగమం, భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.

Read Also: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న రమేష్‌కు షాకింగ్ వ్యాధి..!

అలాగే, నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. మరోవైపు, జోగులాంబ గద్వాల జిల్లాలో బీచుపల్లిలో గల ఆంజనేయ స్వామి ఆలయాలలో వేకువ జాము నుంచే కృష్ణ నదిలో, అలంపూర్ లోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలన వెలిగించి నదిలో భక్తులు వదిలి పెడుతున్నారు. ఇక, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాగా, నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కొనసాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.

Exit mobile version