మర్రి శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత. 40 ఇయర్స్ పాలిటిక్స్… కాంగ్రెస్ లో ఏం జరిగినా తనదైన అభిప్రాయం వెలిబుచ్చడం ఆయన నైజం.. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తనయుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడిగా అందరికీ చిరపరిచితం. మర్రి శశిధర్ రెడ్డి 2004లో జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ ఛైర్మన్‌గా నియమితుడై 19 జూన్ 2014న ఆ పదవికి రాజీనామా చేశారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో 27461 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. నవంబర్ 8, 2020న టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడై, 28 జూన్ 2021న ఆ పదవికి రాజీనామా చేశారు. పార్టీ పదవుల్లో లేకపోయినా పార్టీకి విధేయుడిగా వున్నారు. అయితే తాజా పరిణామాలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
Vijayashanti: కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం హాస్యాస్పదం
అయితే ఈమధ్యకాలంలో ఆయనలో అసంతృప్తి కొంచెం కొంచెం పెరుగుతూనే వుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. పార్టీని నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్కం ఠాగూర్.. రేవంత్ ఏజెంట్‌గా మారిపోయాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీనియర్లను గోడకేసి కొడతా అని అన్నప్పటికీ అధిష్ఠానం కనీసం మందలించలేదని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంతమంది కాంగ్రెస్ నేతల తీరుని శశిధర్ రెడ్డి తప్పుబట్టారు. గాంధీభవన్ కు సమాంతరంగా మరో ఆఫీస్ నడుస్తోందంటూ మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ నేతల్ని ఉలికిపాటుకి గురిచేశాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తుల జాబితా రోజురోజుకు పెరిగిపోతుందనడానికి మర్రి శశిధర్ కామెంట్లే ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలా ఉంటే.. ఠాగూర్ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని, ఇంకెవరికీ ఏజెంట్‌ను కాదని తెలియజేశారు. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యం. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమే అన్నారు మానిక్కం ఠాగూర్. గతంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అనేక విమర్శలు వచ్చాయి.
ఇటీవల పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో పీసీసీ కొన్నారన్న అసంతృప్తి నేతల వాదనను నమ్ముతున్నట్లు తెలిపారు. తాము హోమ్‌గార్డుల్లాగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన దాసోజు శ్రవణ్, రాజగోపాల్‌రెడ్డి చెప్పినవి నిజాలంటున్నారు శశిధర్ రెడ్డి. ముగ్గురు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై రేవంత్ రెడ్డి అండ్ టీం అలా మాట్లాడడం సరికాదని మర్రి శిశిధర్‌రెడ్డి తన అభిప్రాయం కుండబద్ధలుకొట్టారు.
కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ లో వన్ మ్యాన్ షో అరికట్టాలంటూ మర్రి శశిధర్ రెడ్డి, మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కామెంట్లు చేశారు. పీసీసీ చీఫ్ దూకుడికి కళ్ళెం వేయాలని కొంతమంది సీనియర్లు హైకమాండ్ కి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ ఒంటెత్తు పోకడలపై తన నివాసంలో గతంలో జరిగిన సమావేశంలో కొంతమంది కాంగ్రెస్ నేతలతో భేటీ కూడా అయ్యారు మర్రి శశిధర్ రెడ్డి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందానని, తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్ రెడ్డి తాజాగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరూ బయటకు వెళుతున్న వేళ పార్టీలో కీలక నేత శశిధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి ఎలాంటి సంకేతాలు పంపుతుందో చూడాలి. ఇంతకీ మర్రి శశిధర్ రెడ్డి ఏం చేయబోతున్నారు? పార్టీ హైకమాండ్ ఆయన అభిప్రాయాలను పట్టించుకుంటుందా?