Vijayashanti Satires On CM KCR Over Telangana State: కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని స్వయంగా గొప్పలు చెప్పుకోవడం కన్నా హస్యాస్పదం మరొకటి లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆయన ఎలాంటి దీక్ష చెయ్యలేదన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఖమ్మంలో కేసీఆర్ జ్యూసులు తాగినప్పుడు.. విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజలు తిరగబడిన విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదన్నారు. అలాగే నిమ్స్‌లో దొంగ దీక్ష ముచ్చట కూడా అందరికీ తెలిసిందేనన్నారు. ఢిల్లీలో దీక్ష పేరుతో కేసీఆర్ చేసిన గోల్‌మాల్ డ్రామాల గురించి టీఆర్ఎస్‌లో ఉన్న ముఖ్యులందరికీ తెలుసునని చెప్పారు.
తాను చావు నోట్లో తల పెట్టానని, కోమా దాకా వెళ్లొచ్చానని కేసీఆర్ చెప్పినవన్నీ.. అవాస్తవ తుపాకీ రాముడి కథలని ఎద్దేవా చేశారు. ఆ కథలన్నీ విని జనాలు నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ చెప్తోన్న దొంగ దీక్ష కూడా 2009లో చేసిందని.. తెలంగాణ వచ్చింది 2014లో అని ఆమె గుర్తు చేశారు. ఆ తప్పుడు దీక్షకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధమేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఏమైనా 2009 నుంచి 2014 వరకు దీక్షలో కూర్చున్నాడా? అంటూ ప్రశ్నించారు. మనమంతా అమాయకులుగా ఉంటే.. అలాంటి అబద్ధాలు చెప్పి, పబ్లిక్ నెత్తిన టోపీ పెట్టే సమర్థత ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్‌కే సొంతమని విజయశాంతి ఆరోపణలు చేశారు.
అంతకుముందు ట్విటర్ మాధ్యమంగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో, జీహెచ్ఎంసీ మరోసారి అప్పుల వైపు చూస్తోందని విజయశాంతి ఆరోపించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ రూ.5,275 కోట్ల అప్పులు చేసిందని.. తాజాగా మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతోందని అన్నారు. నిధులు కేటాయించాలని ఏటా ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ కోరుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నిధులు ఇవ్వకపోవడంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలంటూ.. బల్దియాపై ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. జీహెచ్ఎంసీకి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా.. అవి ప్రభుత్వం నుంచి అందకపోవడంతో జీహెచ్ఎంసీ అప్పులు చేసి, పనుల్ని పూర్తి చేస్తోందని వెల్లడించారు.