తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఈ రోజు తెలంగాణకు వచ్చారు. షాద్ నగర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ మంచి మిత్రులని ఆయన ఆరోపించారు. వీరిద్దరు గల్లిలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని విమర్శించారు. బీజేపీ నేతలు కేసులు పెడతామని ఒక్క కేసు పెట్టరని విమర్శించారు. అవినీతి చిట్టా ఉందని అంటున్నా..ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. అవినీతి చిట్టా సమర్పించినా స్పందన రాలేదని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయితే ఈడీ, సీబీఐ కేసులు పెడుతారని విమర్శించారు.
మరోవైపు ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేలా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ లో అసమ్మతి కుమ్ములాట ఉండేది అయితే వరసగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశం కావడంతో ప్రస్తుతానికి మాత్రం అసమ్మతి సద్దుమణిగింది. అందరూ కలిసి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం సూచించింది. ఇదిలా ఉంటే రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు కాంగ్రెస్ మేథోమధన సదస్సు, శింతన్ శిబిర్ పేరిట సమావేశాలు నిర్వహిస్తోంది. దీంట్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే అంశంతో పాటు టీఆర్ఎస్ పనితీరును ఎలా ప్రజల్లో ఎండగట్టాలనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది.