Maheshwar Reddy Demands Kavitha To Resign MLC Post And Prove Her Honesty: సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తాజాగా స్పందించారు. లిక్కర్ స్కామ్‌లో ఎవరున్నా, సీబీఐ విచారణలో బయటపడుతుందని.. కవిత ప్రమేయంపై సీబీఐ విచారణ చేస్తుందని.. అప్పుడు వాస్తవాలు బయటపడతాయని అన్నారు. కవిత నిజంగా తప్పు చేయకపోతే.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవచ్చు కదా? అని నిలదీశారు. ‘వివేక్ ఒబెరాయ్ హోటల్‌లో జరిపిన చర్చలు వాస్తవం కాదా? వాస్తవం కాకుంటే నిరూపించుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మొన్నటివరకు మిత్రులుగా మెలిగారని.. ఇప్పుడు అధికార దాహంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తం ఉందని ఢిల్లీలో బీజేపీ పర్వేశ్ శర్మ ఆరోపణలు చేశారని, ఈ స్కామ్‌లో వందల కోట్లు చేతులు మారాయని అన్నారని, ఢిల్లీలో సిసోడియాతో కవిత మీటింగ్ నిర్వమించారని చెప్తున్నారని ఆయనన్నారు. 10 శాతం కమిషన్ పెరగడం వల్లే వందల కోట్లు చేతులు మారాయని.. దీనిపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని కోరారు. పంజబ్, ఢిల్లీ, తెలంగాణలో ఎంతపెద్ద కుంభకోణం జరుగుతుందో స్పష్టమవుతోందన్నారు. 2021 నవంబర్ కొత్త విధానాల పేరుతో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణకి చెందిన ఓ బడా మద్యం వ్యాపారి తెరవెనుక ఉండి, కవితను ముందు పెట్టి ఇదంతా నడిపించారని అభిప్రాయపడ్డారు.
ఈ స్కామ్‌లో కవిత పాత్ర లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం నిజానిర్ధారణ కమిటీ వేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నుండి కవితను తప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. ఈ స్కామ్‌లో చాలా అనుమానాలున్నాయని చెప్పారు. ఢిల్లీ మాదిరి రాష్ట్రంలో కూడా ఎంక్వయిరి వేయాలన్నారు. టెండర్లలో సిండికేట్ అయి, బ్లాక్ లిస్ట్‌లో కంపెనీలు దక్కించుకున్నాయన్నారు. మద్యం రేట్లు పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. 30 వేల కోట్లలో 12 వేల కోట్ల రెవెన్యూ వచ్చిందని ప్రభుత్వం చెప్తోందని.. వెంటనే ఈ విధానాలు మార్చి, గతంలో ఉన్న విధానాన్ని తీసుకురావాలని ఆయన అడిగారు. ఫీనిక్స్‌పై జరుగుతున్న దాడుల్లో మంత్రి కేటీఆర్ పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఓ సామాన్య కంపెనీ అయిన ఫీనిక్స్, ఇప్పుడు లక్షల కోట్ల బిజినెస్ చేస్తోందని.. దీని వెనక ఎవరి స్నేహ హస్తముందని ప్రశ్నించారు.
70 వేల కోట్ల విలువైన భూములను ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, దీనిపై కూడా సీబీఐ విచారణ జరపాలని మహేశ్వర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైర్మన్ చుక్కపల్లి సురేష్, డైరెక్టర్లు కేటిఆర్‌కి బంధువులన్నారు. ముంబై నుండి 30 గ్రూపులుగా ఐటీ దాడులు చేస్తున్నాయని, ఐటీ దాడుల వల్ల వాస్తవాలు బయటకు రావని.. నిజానిర్ధారణ కమిటీ వేసి సీబీఐ విచారణ జరపాలని ఆయన అడిగారు. ఇక ఇదే సమయంలో.. తెలంగాణలో 12 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్రచేయనున్నారని, ఇది దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు.