Maheshwar Reddy Counter To KTR Comments: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని బాంబ్ పేల్చారు. సోనియా గాంధీ పెట్టిన బిక్షతోనే.. కేటీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు పదువులు అనుభవిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను మహేశ్వర్ రెడ్డి అలా స్పందించారు. కాంగ్రెస్ చరిత్రలోనే రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఏ ఒక్కరూ చేయని సాహసాన్ని రాహుల్ గాంధీ చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ఐక్యత కోసం, భారతదేశ నిర్మాణానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోందన్న ఆయన.. ఈనెల 23న తెలంగాణలోకి యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు జరిగే ఈ పాదయాత్రలో లక్షలాది మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం చేయడం కోసం రేపు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలోనే హైదరాబాద్‌లో పాదయాత్ర రూట్ మ్యాప్‌పై స్పష్టత వస్తుందన్నారు.
కాగా.. కేసీఆర్ తమ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఇటీవల కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఒరిగేదేమీ లేదని, దాని బదులు జోడో యాత్ర చేపట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. తెలంగాణలో ఆయన ఎన్నిరోజులైనా యాత్ర చేసుకోవచ్చని, అది తమపై ఏమాత్రం ప్రభావం చూపదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న ఆయన.. రాష్ట్రంలో అస్తిత్వం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, దేశంలో మాత్రం ఆ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు.