Srinivas Goud: రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేది గతంలో.. ఇపుడు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తిన.. నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి.. ఆల్మట్టి ప్రాజెక్టు, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా.. వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు. వస్తున్న నీటిని ఉపయోగించుకోవడంపై కనీసం ఓ సమీక్ష కూడా చేయలేదు అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
Read Also: CM Omar Abdullah: ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ అంశంపై విపక్షాలపై సీఎం ఆగ్రహం..!
ఇక, జూరాల ప్రాజెక్టుపై ఆధార పడ్డ నెట్టెంపాడు, బీమాలకు నీళ్లు తరలించడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సారి ముందు వర్షాలు పడ్డాయి.. నీళ్లు సద్వినియోగం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నీళ్లను నదిలోకి వదులుతున్నారు.. యాసంగిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు.. ఈ వర్షా కాలంలో నీళ్ళుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోంది అని ఆరోపించారు. సంగం బండకు మరమ్మత్తులు చేయకపోవడంతో నీళ్లు నింపుకోని పరిస్థితి దాపురించింది అన్నారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా.. కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉంది.. దేవుడు కరుణించినా పూజారి కరుణించే పరిస్థితి లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా తేలింది. జూరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని పూడికతో నిండి పోయింది.. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్ కు ఈ దుస్థితి ఏమిటీ? అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.