ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ని ప్రతీ ఒక్కరికి తెలియాలని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రైతు డిక్లరేషన్‌లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపికి భయంపట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టి లేపిందని, కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అంటే మోసం, దగా అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ రైతాంగాన్ని కాపాడటానికి రైతు డిక్లరేషన్ ని తీసుకుందని, నిరుద్యోగులు, ఆదివాసులు, మైనారిటీలని ఏకం చేస్తూ మరో బహిరంగ సభ ఉంటుందని ఆయన ప్రకటించారు. సోనియాగాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే ఎమ్మెల్యేకి బంగ్లాలు , వజ్ర వైడూర్యాలు ఎట్లా వచ్చాయని, టీఆర్‌ఎస్ పార్టీకి 884 కోట్ల రూపాయల ఫండ్ ఎట్లా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చిన తరువాత తెలంగాణ మేలుకుందని ఆయన అన్నారు.