తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆడుకుంటున్నాయని, ఏపీ, కర్ణాటకలో లేని సమస్య తెలంగాణలోని ఎందుకు ఉందని ఆయన మండిపడ్డారు. నేనే ధాన్యం కొంటా అన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఏమి చేయడం లేదని, రూ.1900 మద్దతు ధర దక్కాల్సిన రైతులకు 1300 దక్కుతుందన్నారు. మిల్లర్ లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని, తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం పెద్ద కుంభకోణమన్నారు.
బలహీన వర్గాలకు చెందిన గవర్నర్ పై రాష్ట్ర ప్రభుత్వ మాటలు సరికావని, ధాన్యం సేకరణ పై సీబీఐ విచారణ చేయాలని గవర్నర్ ని కలసి విజ్ఞప్తి పత్రాలు ఇస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఈ నెలాఖరున తెలంగాణలో పర్యటిస్తారని, ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని కేంద్ర మంత్రులను ఎందుకు కలవలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.