Madhu Goud Yaskhi On Rahul Gandhi Bharat Jodo Yatra: కులం, మతం పేరుతో మన భారతదేశాన్ని విడదీస్తున్నారని.. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన మధుయాష్కీ గౌడ్ తెలిపారు. తెలంగాణలో ఈ యాత్రను సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు యోగేందర్ యాదవ్ కూడా పాల్గొంటున్నారని అన్నారు. సివిల్ సోసైటీ మీటింగ్‌లో పాల్గొన్నారని, రాహుల్ యాత్రకు రాష్ట్రంలో మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారని చెప్పారు.
ఇదే సమయంలో సామాజిక వేత్త యోగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. విభజన పేరుతో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. మన దేశాన్ని రాహుల్ గాంధీ ఐక్యంగా ఉంచడానికి యాత్ర చేస్తున్నారని తెలిపారు. క్రోనీ క్యాపిటలిజం నడుస్తోందని.. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. రాహుల్ యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక మహిళా నేత సంజన మాట్లాడుతూ.. తెలంగాణాలో అత్యాచారాలు, ఎన్‌కౌంటర్లు విపరీతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజా, స్త్రీ సమస్యలపై రెగ్యూలర్‌గా పోరాటం చేస్తున్నామన్నారు. సివిల్ సోసైటీ గ్రూప్‌గా ఇవాళ సమావేశంలో పాల్గొన్నామని, రాహుల్ యాత్రలో మహిళలు పెద్దఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.
మరోవైపు.. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జోరుగా కొనసాగుతుంది. తూముకూర్ జిల్లాలో యాత్ర సాగుతుండగా.. రాహుల్‌గాంధీకి స్థానికులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహా మాజీ మంత్రులు, కర్ణాటక పీసీసీ సభ్యులు ఈ యాత్రలో ఉత్సహాంగా పాల్గొంటున్నారు. ఈ యాత్రకు జిల్లా కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ జోడో యాత్ర ఈనెల 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణమండలం గూడవల్లూరు గ్రామంలోకి ప్రవేశించాక రోజంత యాత్ర నడుస్తుంది. దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో యాత్రకు రాహుల్ విరామం ప్రకటించి.. 26న మక్తల్‌లో తిరిగి యాత్రని ప్రారంభిస్తారు.