బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయని.. వారి కుట్రను ప్రతిఒక్కరూ గమనించాలని టీపీసీసీ ప్రచారకర్త కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతోన్న బీజేపీ.. ఆయన్ను జైలుకు ఎందుకు పంపడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రతిపక్షాల తరఫున కేంద్రం వద్ద మాట్లాడలేదని అన్నారు. 8 ఏళ్లుగా పార్లమెంట్‌లో ప్రధానిని ఏనాడూ కేసీఆర్ ప్రశ్నించలేదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై మాత్రం కాల్పులు జరుపుతున్నారన్నారు.
తెలంగాణ ప్రజల భవిష్యత్ పట్ల కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పిన మధుయాష్కీ.. ధరణి చట్టం వల్ల వేలాదిమంది రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూముల్ని కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాటిని లాక్కుంటోందని ఆరోపించారు. మహబూబాబాద్‌లో 5 వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల దగ్గర నుండి లాక్కుందన్నారు. రైతు బంధు వస్తోన్న రైతుల దగ్గర నుండి కూడా భూముల్ని తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఉదేశ్యపూర్వకంగానే ధరణి తెచ్చి భూములు లాక్కుంటున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇక ఇదే సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంపై మధుయాష్కీ మాట్లాడారు. తన తండ్రి పీజేఆర్ జ్ఞాపకార్థం కాంగ్రెస్ నేతల్ని విష్ణు పిలిచారని, తండ్రికి తగ్గ తనయుడిగా విష్ణు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పీజేఆర్ పోరాటం చేశారని, హైదరాబాద్‌లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిచ్చారని గుర్తు చేసుకున్నారు.
విష్ణుని చూసి కాంగ్రెస్ యువత ముందుకు రావాలని, రాహుల్ గాంధీ నాయక్వత్వంలో అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారని, పార్టీని నమ్మి పని చేసిన వారికి అన్యాయం జరగదని మధుయాష్కీ గౌడ్ భరోసానిచ్చారు.