Tragic: హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ కొడుకు తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు రవీందర్ చదువు కోసం సుమారు ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని చదువుల మీద కాకుండా, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి పోగొట్టేశాడు రవీందర్. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తీవ్రంగా మందలించాడు.
దీంతో కోపంతో ఊగిపోయిన రవీందర్.. తన తండ్రిని హత్య చేసి, అది ఆత్మహత్యగా మలచే ప్రయత్నం చేశాడు. తర్వాత మృతదేహాన్ని స్వస్థలమైన వనపర్తి తీసుకెళ్లి, అక్కడ కర్మకాండలు పూర్తి చేయాలని చూస్తుండగా, ఈ వ్యవహారంపై బంధువులకు అనుమానం వచ్చింది. అందిన సమాచారం మేరకు పోలీసులు విచారణ జరిపారు. అప్పటివరకు తండ్రిని తానే హత్య చేశానని ఒప్పుకోలేదు రవీందర్.
కానీ దర్యాప్తు లోతుగా జరపడంతో చివరకు ఒప్పుకుని, తానే తండ్రిని చంపినట్టు అంగీకరించాడు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదువు కోసం ఇచ్చిన డబ్బులు లోటస్, బ్లూజోన్, స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్ వంటివాటిపై పెట్టి పోగొట్టడంతో చివరకు ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.