వినాయక చవితి అంటే మామూలుగా వుండదు.. వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేయడం కామన్. వినాయకుడికి పెట్టే లడ్డూ కూడా చాలా ఫ్యామస్. ఈ లడ్డూని వేలం వేసి లక్షలు పాడుకుంటారు. అలాంటిది విఘ్ననాయకుడి లడ్డూని కొట్టేశాడో దొంగ. అదీ కూడా పబ్లిక్ గా.. సీసీ కెమేరా సాక్షిగా ఆ దొంగ చేసిన పని ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ అవుతోంది.
జగిత్యాల పట్టణంలో హనుమాన్ వాడ హనుమాన్ దేవాలయం లో వినాయక విగ్రహం ఏర్పాటుచేశారు. ఎప్పటి లాగే వినాయకుడికి లడ్డూ కూడా ప్రసాదంగా పెట్టారు. కానీ ఈ లడ్డూ చోరీకి గురి కావడంపై భక్తులు మండిపడుతున్నారు. స్థానిక హనుమాన్ వాడ లోని హనుమాన్ దేవాలయంలో గల వినాయకుని మండపం లోని గణేష్ లడ్డూ చోరీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. తాపీగా వచ్చిన ఒక దొంగ మండపంలోని వినాయక విగ్రహం దగ్గరికి వెళ్ళి.. వినాయకుడి చేతిలోని లడ్డూ కాజేశాడు. లడ్డూ కోసం వచ్చిన దొంగ ముసుగు వేసుకుని వచ్చాడు. లడ్డూ చోరీ చేసుకుని నింపాదిగా అక్కడినుంచి జారుకున్నాడు. మెడలో కండువా, ముసుగు, అతని డ్రెస్ ఆధారంగా ఆ దొంగ పని పట్టే పనిలో వున్నారు పోలీసులు.
Read Also: Thirty Five Years for Swayamkrushi : మూడున్నర పదుల ‘స్వయంకృషి’
రెండురోజుల క్రితం సిరిసిల్ల జిల్లా, గోపాల్ నగర్ మండలంలో ఉన్న గణనాథున్ని ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనం కలిగించింది. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు, నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయారు. వినాయక మండపానికి తలుపులు లేకపోవడంతో అలాగే వదిలేశారు. సాధారణంగా వినాయక మండపంలో పూచిక పుల్ల కూడా కదలదు. ఎవరైనా వస్తే ప్రసాదం తీసుకువెళతారు. అది కూడా అర్థరాత్రి కావడంతో నిర్వాహకులు ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున నిర్వాహకులు మండపానికి వచ్చి చూసేసరికి అవాక్కయ్యారు. వినాయక విగ్రహం అక్కడ కనిపించలేదు. వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం కనిపించకపోవడంతో అందరం బాధపడ్డామని స్థానికులు చెప్పారు. ఆలయాల్లో హుండీ ఎత్తుకెళ్లడం కామన్.. డబ్బులు, బంగారం, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురి అవుతుంటాయి. కానీ దేవుడినే మింగే దొంగలున్నారని, తస్మాత్ జాగ్రత్త అని ఇతర మండపాల నిర్వాహకులకు సలహాలు చెబుతున్నారు ఈ మండపం నిర్వాహకులు.
Read Also: Uttarakhand: పరువు హత్య.. అల్లుడిని దారుణంగా హత్య చేసిన అత్తమామలు