కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మరపురాని చిత్రాలను నిర్మించారు. వారి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘స్వయంకృషి’. విశ్వనాథ్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండవ చిత్రం ‘స్వయంకృషి’. ఈ చిత్రానికి ముందు వీరి కాంబోలో వచ్చిన ‘శుభలేఖ’ జనాన్ని భలేగా అలరించింది. ‘శుభలేఖ’ తరువాత ఐదేళ్ళకు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి ‘స్వయంకృషి’లో నటించారు. నిజానికి చిరంజీవి లాంటి మాస్ హీరో డేట్స్ ఇస్తే, ఆ రోజుల్లో ఎవరైనా ఓ మాస్ మసాలా మూవీ తెరకెక్కించేసి కాసులు దండుకొనేవారు. కానీ, మొదటి నుంచీ అభిరుచిగల నిర్మాతగా సాగిన ఏడిద నాగేశ్వరరావు మాత్రం చిరంజీవినే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారే తప్ప, రాజీపడలేదు. అప్పట్లో చిరంజీవికి ఉన్న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా రూపొందిన చిత్రం ‘స్వయంకృషి’. 1987 సెప్టెంబర్ 3న ‘స్వయంకృషి’ జనం ముందు నిలచింది.
‘స్వయంకృషి’ కథ ఏమిటంటే – సాంబయ్య చెప్పులు కుట్టి జీవిస్తూ ఉంటాడు. శారద అనే అమ్మాయిని చదివిస్తాడు. ఏ రోజుకైనా ఆమెను పెళ్ళాడాలన్నదే సాంబయ్య అభిలాష. అయితే శారద తాను చదువుకొనే చోటే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. వారి పెళ్ళికి సాంబయ్య కూడా అంగీకారం తెలుపుతాడు. సాంబయ్యకు తన చెల్లెలు కొడుకు చిన్నా ఆలనాపాలనా బాధ్యత ఉంటుంది. అదే సమయంలో సాంబయ్య అంటే ప్రాణమిచ్చే గంగ అతనితో పాటే లోకమని భావిస్తుంది. చిన్నాను ఆమె కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. సాంబయ్య జీవితంలో గంగ ప్రవేశించిన తరువాత అతని దశ తిరిగిపోతుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ చెప్పుల దుకాణం నడిపే స్థాయికి చేరుకుంటాడు. ఎంతో ధనవంతుడవుతాడు. ఆ సమయంలో సాంబయ్య చెల్లెలు భర్త గోవింద్ జైలు నుండి వస్తాడు. తన కొడుకును తనతో పంపమంటాడు. అందుకు సాంబయ్య అంగీకరించడు. సాంబయ్య దగ్గరే తన కొడుకు ఉండాలంటే కొన్ని షరతులు ఉన్నాయని చెబుతాడు గోవింద్. తన కొడుకు చిన్నాను తీసుకు వెళ్ళి తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తాడు. దాంతో సాంబయ్య, గోవింద్ ను నిలదీస్తాడు. అతనికి కావలసింది డబ్బే అని భావించి, తన యావదాస్తినీ చిన్నా పేరున రాస్తాడు సాంబయ్య. చివరకు మేనమామ సాంబయ్యకు తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటాడు చిన్నా. తండ్రిని ఎదిరిస్తాడు. సాంబయ్య చివరకు తన చెప్పులుకుట్టే వృత్తిలోనే సాగాలనుకుంటాడు. సాంబయ్య చెంతనే చిన్నా కూడా వచ్చి, తానూ చెప్పులు కుట్టే పనికి పూనుకోవడంతో కథ ముగుస్తుంది.
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలో సుమలత, సర్వదమన్ బెనర్జీ, మాస్టర్ అర్జున్, చరణ్ రాజ్, జె.వి.సోమయాజులు, బ్రహ్మానందం, ఎమ్వీయస్ హరనాథ రావు, పి.యల్.నారాయణ, ఎస్.కె. మిస్రో, బేబీ భావన, డబ్బింగ్ జానకి, సంయుక్త నటించిన ఈ చిత్రానికి రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చారు. సి.నారాయణ రెడ్డి, సిరివెన్నెల పాటలు రాయగా, “మంచి వెన్నెల ఇప్పుడు…” అనే క్షేత్రయ్య గీతం కూడా చిత్రంలో చోటు చేసుకుంది. “పారాహుషారు…”, “సిన్ని సిన్ని కోరికలడగా…”, “హలో హలో డార్లింగ్…”,”సిగ్గు పూబంతి…”,”కాముడు కాముడు…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘స్వయంకృషి’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు.