KTR Write A Letter To Central Government For Metro Phase 2 Funds: హైదరాబాద్ మెట్రో ఫేస్ 2, విస్తరణకు భారీ నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. లక్డీకాపూల్ – బీహెచ్ఈఎల్ నిర్మాణం, నాగోల్ – ఎల్బీనగర్ మెట్రో అనుసంధానం పనుల కోసం నిధులు ఇవ్వాలని ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కేటీఆర్ తెలిపారు. మెట్రో పనులకు గాను రూ.8453 కోట్లు సూత్రప్రాయ అంగీకారం ఇవ్వాలని కోరారు. వచ్చే బడ్జెట్‌లో మెట్రో ఫేజ్ 2, విస్తరణకు నిధులు కేటాయించి తీరాలని డిమాండ్ చేశారు. మరి, కేంద్రం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కేటీఆర్ కోరినట్లు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
అంతకుముందు.. హైదరాబాద్‌లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చెన్నై, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవనం ఎంతో సులభమని తెలిపారు. భాగ్యనగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 2014లో తెలంగాణ నుంచి రూ.57వేల కోట్లు ఎగుమతులు ఉండేవని.. ఇప్పుడు రూ.1.83 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌కు రాబోతోందని, ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందని చెప్పారు. విప్రో, సేల్స్ ఫోర్స్, మెటా, ఉబర్ వంటి పెద్ద సంస్థల రెండో అతిపెద్ద క్యాంపస్‌లు కూడా నగరంలోనే ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి ఇది ఒక చిహ్నమని.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా జీవించే సౌకర్యాలున్నాయని పేర్కొన్నారు.
అలాగే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రసంగించినప్పుడు వారసత్వ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పనికి వస్తుందన్న.. ప్రతిభను నిరూపించుకోకపోతే ఏ ఒక్కరూ రాజకీయాల్లో రాణించలేరని తేల్చి చెప్పారు. ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని ఆయన గుర్తు చేశారు. తన పనితీరుతోనే సిరిసిల్లలో తనకు క్రమంగా మెజారిటీ పెరుగుతూ వస్తోందని.. తాను సరిగ్గా పనిచేయకపోతే, సిరిసిల్ల ప్రజలు తనను ఎప్పుడో పక్కనపెట్టేవారని కూడా ఆయన అన్నారు.