KTR Showed His Humanity By Saving Injured Woman In Munugode: సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ట్విటర్ మాధ్యమంగానే కాదు, నేరుగానూ ఆయన చేయూతని అందించారు. ఇప్పుడు మరోసారి కేటీఆర్ మానవత్వాన్ని చాటిచెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తల్ని ఆదుకున్నారు. మంగళవారం మునుగోడులో తన ప్రచారం ముగించుకొని, కేటీఆర్ హైదరాబాద్‌కి తిరుగు పయమన్నారు. మార్గ మధ్యంలో ఓ జంట ప్రమాదానికి గురై, రోడ్డు పక్కన పడి ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో.. వెంటనే కాన్వాయ్ ఆపి, ఆ జంటను పరామర్శించారు. కల్వకుర్తికి చెందిన తాము, తమ పాపని హాస్టల్‌లో దించేసి తిరిగి ఇంటికి వెళ్తున్నామని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని ఆ మహిళ తెలిపింది. ఆమె చేతికి తీవ్ర గాయం కావడంతో.. తన కాన్వాయ్ వాహనంలోనే భార్యాభర్తల్ని హైదరాబాద్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాంధవుడిలా కాపాడారంటూ.. కేటీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆపద్బాంధవుడు @KTRTRS 🙏
మంత్రి కేటీఆర్ గారి మునుగోడు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది చూసి తన కారును ఆపి స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు pic.twitter.com/RfbFSCeYsq
— Thirupathi Bandari (@BTR_KTR) November 1, 2022
మంత్రి కేటీఆర్ ఇలా ఆదుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా.. రక్తమోడుతున్న ఇద్దరు విద్యార్థుల్ని తన కాన్వాయ్‌లోనే ఆసుపత్రికి తరలించారు. గతేడాది నవంబర్ నెలలో.. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలోనే కేటీఆర్ కాన్వాయ్ అటునుంచి వెళ్లింది. అప్పుడు ఆ విద్యార్థుల్ని గమనించిన కేటీఆర్, వెంటనే తన కారుని ఆపేశారు. ప్రమాదం గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన.. ఆ విద్యార్థుల్ని తన ఎస్కార్ట్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు.. మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారిని కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన దర్శనం శ్రీనివాస్, సవిత దంపతులకు అవంతిక అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. ట్విటర్ మాధ్యమంగా ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. తన కార్యాలయాన్ని సంప్రదించి, పూర్తి సహాయం పొందాలని భరోసానిచ్చారు.