జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోర్దినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ అధ్వర్యంలో కేటీపీపీ 11వందల మెగావాట్ల ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు,ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన చేపట్టారు. విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది.
ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)1, 2 దశల కర్మాగారాల ఉద్యోగులు, కార్మికులు బుధవారం విధులను బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ప్రధాన గేటు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు. దేశాభివృద్ధిలో భాగమైన విద్యుత్తు సంస్థలను, కేంద్ర ప్రభుత్వం తన మిత్రులుగా ఉన్న కొన్ని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న విద్యుత్ సంస్థలు దేశంలోని 25 కోట్ల వినియోగదారులు, వ్యవసాయదారులు, పరిశ్రమ వర్గాలకు సరళమైన విద్యుత్తును అందిస్తున్నాయి.
అలాంటి విద్యుత్ సంస్థలను ప్రభుత్వానికి సన్నిహితులుగా మెలుగుతున్న బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ప్రైవేటు పరం చేయ్యాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కోణంలో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థను విద్యుత్ సవరణ బిల్లు ద్వారా లాభార్జనతో పనిచేసే ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే ప్రయత్నాలను విద్యుత్ ఉద్యోగులందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సవరణ బిల్లు ద్వారా మన రాష్ట్రంలో 50 వేల మంది విద్యుత్ ఉద్యోగులు, సుమారు కోటి తొంబై లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై ప్రభావం పడబోతోందన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని, ప్రమాదాలు పెరుగుతాయని, ప్రజలపై అధిక ఛార్జీల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.