కొత్త ఏడాది వచ్చింది.. కొత్త క్యాలెండర్ల ఆవిష్కరణ కొనసాగుతూనే ఉంది.. ఇక, జీవితానుభవాలను కవిత్వంగా మలిచి, ఆ కవిత్వాన్ని మంచిమాటలుగా మార్చి, కొటేషన్ల రూపంలో ప్రతి ఏటా క్యాలెండరుగా అందించే కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన 2022 క్యాలెండరును ఆవిష్కరించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ “మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “మానవ జీవితమే ఒక మహాభారతం – అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం” అని, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే మాటలకు ప్రభావితమైన అర్జునుడు ఉత్సాహంగా యుద్ధంలో గెలిచాడాని, అదేవిధంగా, శల్యుడు అన్న మాటలకు ప్రభావితమైన కర్ణుడు నిరుత్సాహానికి లోనయి యుద్ధంలో ఓడిపోయాడని, మంచిమాటలకు చెడ్డమాటలకు మనుషుల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయనేదానికి మహాభారతమే ఒక గొప్ప ఉదాహరణ అంటూ అందుకే మనం ఎల్లపుడూ మంచినే మాట్లాడాలని, శుభమే పలకాలని అన్నారు.
Read Also: మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ కెప్టెన్‌పై ఐసీసీ బ్యాన్
ఇక, జీవితంలో మనకెదురయ్యే రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి, పరిస్థితుల్ని విశ్లేషించగలిగే విచక్షణ పెంచుకోవడానికి మంచి మాటలు వినడం ద్వారా, మంచి రచనలు చదవడం ద్వారా, మనకు ఎదురయ్యే అనుభవాల ద్వారా విచక్షణ జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవచ్చని అన్నారు. అలా తన అనుభవాల్లోంచి నేర్చుకున్న జీవితపాఠాలను మంచిమాటల రూపంలో క్యాలెండర్లుగా రూపొందించి గత ఏడెనిమిదేళ్ళుగా అందరికీ అందిస్తున్నాని, పొద్దున్నే ఒక మంచి మాట విన్నా, చదివినా అది మనల్ని ప్రభావితం చేసి, రోజంతా మనం పాజిటివ్ గా ఉండేట్టు చేస్తుందని, ఒక్క మనిషి పాజిటివ్ గా స్పందించినా, ఒక్క మనసు తన మాట వల్ల ప్రభావితమైనా, ఒక్క వ్యక్తిలో ఆలోచన కలిగించగలిగినా తన ప్రయత్నం సఫలీకృతమైనట్లుగా భావిస్తానని” అన్నారు కొత్త శ్రీనివాస్. ఇక, ఆయన సతీమణి, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి మాట్లాడుతూ “మావారి కొటేషన్లు ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటాయని, వాటి వల్ల ప్రభావితమైతున్నామని పలువురు చెబుతుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుందని, ఇలాంటి మంచి మాటలు వినడం ద్వారా, మంచి రచనలు చదవడం ద్వారా, మనకు ఎదురయ్యే అనుభవాల ద్వారా విచక్షణ జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవచ్చని, జీవితమనే సినిమాలో అందంగా కనిపించడంకనా పోషించే పాత్ర గొప్పగా ఉండాలనే కొటేషన్ తనకు ప్రేరణ అని, నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన రచనలే నాకు స్ఫూర్తి” అని అన్నారు. ఇక, ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.