తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చుట్టూ చర్చ సాగుతూనే ఉంది.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న అందరినీ తొలచివేస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ నేతలను కలిసినా.. ఆ పార్టీలో చేరతారు అనే ప్రచారం ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంటుంది. తాజాగా, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశం కావడంతో.. మరోసారి పొలిటికల్ పార్టీ రీ ఎంట్రీ చర్చ తెరపైకి వచ్చింది. అయితే, తాను ఏ పార్టీలో ఇప్పట్లో చేరను అంటూ క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు.
బీజేపీ నేను అనుకున్న రీతిలో రియాక్ట్ కావడం లేదన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. టీఆర్ఎస్‌పై బీజేపీ కేంద్ర నాయకత్వం ముందడుగు వేయడంలేదన్న ఆయన.. బీజేపీ రెండు అడుగులు ముందుకు వేస్తే.. మేం నాలుగు అడుగులు వేస్తామన్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. రేవంత్ వచ్చిన తర్వాత పార్టీ పుంజుకున్నట్టు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ.. రెండు పార్టీలకు చెందిన నేతలతోనూ మాట్లాడనున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణలో ఓ ప్రాంతీయ పార్టీ అవసరం ఉందన్నారు.. దాని కోసం కూడా అందరితో మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ని ఎవరైతే కొట్టగలుగుతారు అనుకుంటే అప్పుడు ఆలోచన చేస్తామని.. అప్పటి వరకు న్యూట్రల్ గానే ఉంటానని స్పష్టం చేశారు. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.