ధరణి పోర్టల్‌పై ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంత మొత్తుకున్నా .. అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను భయపెట్టి, అక్రమ కేసులు పెట్టి భూమిని ఆక్రమించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని రైతులు డిమాండ్ చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. ఎందుకు నాగారంలో ఉన్న భూములను మాత్రమే ఎందుకు నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన అన్నారు.
అసైన్డ్ భూములు భూస్వాముల చేతుల్లోకి వెళ్ళడం సరికాదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ ఉండే చాలా మంది అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని, ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో మళ్ళీ భూస్వాముల కొమ్ముకాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని, మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను బీజేపీ నాయకులకు అందించేందుకు మేము సిద్దంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోరని ఆయన అన్నారు. ధరణి పోర్టల్‌ను తొలగించాలని, తిరిగి పాత సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌ల కింద భూసేకరణలో ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తోందని, తక్కువ ధరలకు రైతుల నుంచి భూసేకరణ జరుగుతోందని ఆయన అన్నారు.