తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు గుప్పించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా కేసీఆర్ ను కాపాడలేరని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు అని కిషన్ రెడ్డి అన్నారు. భారత్ నుంచి బీజేపీని తరమికొట్టే దమ్ము భూప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. వరి ధాన్యం కొనేది కేంద్రం మాత్రమేనని రైతులకు అర్థమైందన్నారు కిషన్ రెడ్డి. పొదుపు సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీపై కక్ష కట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్తామన్నారు కిషన్ రెడ్డి.